హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడింది. అంతేకాదు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలను కూడా పొందుపరిచారు. ఈ సందర్భంగా గరుడ పురాణం విశిష్టత ఏంటి.. దీన్ని ఎప్పుడు చదవాలి.. ఇందులో ఉన్న నియమాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
గరుడ పురాణ నియమాలు
గరుడ పురాణం పఠించే ముందు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా మందిలో అనేక అపొహలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. అందుకే దీన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మాత్రమే ఈ గ్రంథాన్ని చదవాలి. అది కూడా మనసులో ఎలాంటి వాటిని పెట్టుకోకుండా చదవాలి. అంతేకాదు మీరు గరుడ పురాణం పఠించాలనుకుంటే శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.