అట్లతద్ది పూజా విధానం PDF తెలుగు
Download PDF of Atla Thaddi Pooja Vidhanam Telugu
Misc ✦ Pooja Vidhi (पूजा विधि) ✦ తెలుగు
అట్లతద్ది పూజా విధానం తెలుగు Lyrics
`అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్!’ అంటూ పాడుతూ, ఆటపాటలూ, చప్పట్లూ, కోలాహలమూ, సందడితో జరిగే పండుగ ఇది. చంద్రోదయ సమయం తరువాత ఈ పండుగ ఊపునందుకుంటుంది. గౌరీదేవిని విధ్యుక్తంగా పదహారు ఉపచారాలతోనూ పూజించుకుని, పసుపు కుంకుమలు, వస్త్రాలు సమర్పించుకుని, అట్లు నివేదించి, తాము ఆహ్వానించిన ముత్తయిదువులకు తాంబూలాలతో సహా వాయనాలు ఇవ్వడం… ఇట్లా బహు సంబరంగా సాగుతుంది అట్ల తద్దె.
ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్ల తద్దె నోము చేసుకోని తెలుగు వనిత వుండనే వుండదు. కన్యలు తమకు చక్కని వరుడు కావాలనీ, వివాహితలు సత్సంతానం కోసం ఈ నోము నోస్తారు. ఈ నోము చేసుకున్న తరువాతే పార్వతీదేవి, పరమేశ్వరుణ్ని పతిగా పొందిందట. ఈ నోమును గురించి గిరిజాదేవికి చెప్పినవాడు నారదమహర్షి. చంద్రోదయం తరువాత చేస్తారు కనుకనూ, సాక్షాత్తూ గౌరీదేవే స్వయంగా నోచుకున్నది కనుకనూ, ఈ వ్రతానికి `చంద్రోదయ గౌరీవ్రతం’ అనే పేరు కూడా వుంది.
అట్లతద్ది పండుగలోని రహస్యం
పెళ్ళయిన స్త్రీలు చేస్తే కుటుంబం ధనధాన్యాలతో సంతాన వృద్ధి జరుగుతుంది. పెళ్ళికాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు. నవగ్రహాలలోని కుజుడు అనగా అంగారకునికి అట్లంటే ఇష్టం. అట్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడం వల్ల కుజదోషం పోయి సంసారంలో ఎలాంటి అడ్డంకులు రావు. స్త్రీలలో కుజుడు రజోదయమునకు కారకుడు కాబట్టి ఋతు సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుతాడు. అందువల్ల గర్భధారణ సమస్యలవంటివి ఉత్పన్నం కావు.
ఈ అట్ల తయారీలో మినుములు, బియ్యాన్ని ఉపయోగిస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి ఇష్టమైన ధాన్యాలు. ఈ ధాన్యాలలో తయారుచేయబడిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగిపోతాయి. గర్భస్రావాల వంటివి నివారించబడి సుఖప్రసవం జరుగుతుంది. అట్లతద్ది పండుగలోని రహస్యం ఇదే.
వ్రతమెలా చేయాలి:
ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారుజామునే లేచి, చద్ది అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగులతో, కడుపు నిండా సుష్ఠుగా భోజనం చేయాలి. తాంబూలం మరిచిపోకుండా వేసుకోవాలి. ముందు రోజే చేతులూ, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు కనుక అవీ, నోరూ ఎరగ్రా పండి కళకళలాడుతూ వుంటారు. తరువాత ఆటపాటలతో కాలక్షేపం చేయాలి. ఉయ్యాల ఊగాలి. స్నానపానాలు ముగించి, గౌరీదేవిని పూజించుకోవాలి. పగలంతా ఉపవాసం వుండాలి. చీకటి పడ్డాక చంద్రదర్శనం తరువాత తిరిగి శుచి అయి మళ్లీ గౌరీపూజ చేసుకుని, అమ్మవారికి పది అట్లు నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత ముత్తయిదువులను అలంకరించి, పదేసి అట్లు, పది పళ్లు వాయనం ఇవ్వాలి. ఆ పైన వ్రతకథను చెప్పుకుని, అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఆ పైన భోజనం చేయాలి.
పూర్వవృత్తాంతం:
పూర్వం ఒక రాజుకు కుమారులున్నారు కానీ, పుత్రిక కోసం పరితపించాడు. చిట్టచివరికి కూతురు పుట్టింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆమె అన్నలకు కూడా చెల్లెలంటే పంచప్రాణాలు. ఎంతో గారాబంగా చూసుకునేవారు. రాకుమార్తెకు యుక్తవయస్సు రావటంతో, వరాన్వేషణ చేయసాగారు. ఎందరిని చూసినా, దాదాపు కుదిరినట్లే అనుకున్న తరువాత, అవి తప్పిపోతుండేవి. అలా జరగటానికి కారణమేమిటో తెలియక పాపం, ఆ రాకుమారులు, కుమిలిపోతుండేవారు. ఇట్లా ఎన్నోసార్లు జరిగిన తరువాత, రాకుమారి విరక్తి చెంది, గౌరీదేవి ఆలయానికి వెళ్లి, అక్కడ ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నది. సరిగ్గా ఆ సమయానికి, అశరీరవాణిగా గౌరీదేవి, చంద్రోదయగౌరీవ్రతం ఆచరిస్తే, మంచి భర్త లభిస్తాడని చెప్పింది. దేవి చెప్పినట్లుగా, వ్రతాన్ని ఆచరించింది రాకుమార్తె. చంద్రోదయం వరకూ వేచివుంటే, సుకుమారి అయిన తమ చెల్లెలు, శోష వచ్చి పడిపోతుందేమో అనుకుని బెంబేలెత్తిన రాకుమారులు, చంద్రోదయం కాకుండానే, ఒక చోట మంట వేసి, ఆ మంటను అద్దంలో సోదరికి చూపించారు. అది చంద్రోదయమే అనుకున్న రాకుమార్తె, భోజనం చేసింది. ఆ విధంగా వ్రతభంగం కావటంతో, మళ్లీ ఎన్నో సంబంధాలు, కుదరకపోయేసరికి, వయసు మీరినవారిని చూడసాగారు, తల్లిదండ్రులు. బెదిరిపోయిన రాకుమార్తె, ముసలి భర్తతో జీవించటం కంటే, జీవితాన్నే ముగించుకోవటం మేలని, అడవిలోకి పారిపోయి, మళ్లీ ఆత్మహత్యకు తలపడింది.
ఆదిదంపతుల అనుగ్రహం:
భూలోకసంచారం చేస్తున్న పార్వతీపరమేశ్వరులు, వృద్ధదంపతుల రూపంలో ఆకాశం నుంచి దిగి వచ్చి, ఆమె అన్నలు చేసిన పొరపాటును తెలియజెప్పి, మరోసారి, ఎలాంటి పొరపాట్లూ చేయకుండా వ్రతాచరణ చేయమనీ, అలా చేస్తే తప్పకుండా మంచి జీవితం లభిస్తుందనీ చెప్పి, ఆశీర్వదించి పంపించారు. ఆ విధంగా చేసిన ఆ రాకుమార్తెకు, అతిత్వరలోనే మహాశివభక్తుడైన కరివీరుడనే యువకునితో వివాహమై, జీవితాంతమూ సకలసంపదలతో తులతూగుతూ గడిపింది.
ఉద్యాపన:
పదిమంది ముత్తయిదువులకు, ఒక్కొక్కరికీ, ఒక నల్లపూసల గొలుసు, లక్క జోళ్లు, రవికెల బట్ట, దక్షిణ, తాంబూలంతో పాటు పది అట్ల చొప్పున వాయనం ఇవ్వాలి. వారికి విందు భోజనం పెట్టి, సంతృప్తి పరచి, వారి దీవెనలు అందుకున్న తరువాతే, వ్రతం చేసినవారు భోజనం చేయాలి.
మన పెద్దలు ఏర్పరచిన ప్రతి నియమమూ, ప్రతి నోమూ, వ్రతాల వెనుక ఎంతో చక్కని శాస్త్రీయత వున్నది. అందుకనే ఆయా వ్రతాలకు విశిష్టత కలిగింది. కుజదోషం గల స్త్రీపురుషులకు త్వరగా వివాహాలు కావు. కుజదోషం గల యువతులు, అట్ల తద్దె నోము నోచుకోవటం వల్ల, వారికున్న కుజదోషం పోవటమే కాకుండా, సాంసారి జీవితం కూడా సాఫీగా గడిచిపోతుంది. పైగా ఈ వ్రతం రాహు చందలకు కూడా సంబంధించింది కావటంతో, గర్భదోషాలు సైతం పరిహారమై, సంతానసుఖమూ కలుగుతుంది. ఉపవాసమూ, ఉయ్యాలలు ఊగటం వల్ల ఆడపిల్లలకు నడుము గట్టిపడుతుందని మన బామ్మలు ఏ నాడో సెలవిచ్చారు. ఆటపాటలతో మానసికోల్లాసమూ, తద్వారా శారీరకారోగ్యమూనూ. మరదే పెద్దల మాటంటే!
పతిదేవుని కోసం:
అనాదిగా మన దేశంలో స్త్రీలు, భర్తను దైవసమానుడుగా భావించి పూజించటం వుంది. అందుకని అలాంటి పతిదేవుని కోసం రోజంతా నీరైనా తీసుకోకుండా ఉపవసిస్తారు ఇల్లాళ్లు. ఈ వ్రతం కూడా అట్ల తద్దెలా తెల్లవారు జామునే ప్రారంభమవుతుంది. సాయంకాలం చంద్రదర్శనం అయిన తరువాతే ముగుస్తుంది. మహాశివుడు, ఈ వ్రతాన్ని గురించి తన ప్రియభార్య అయిన పార్వతీసతికి చెబుతాడు. అర్జునుడు పాశుపతాస్త్రం సాధించటం కోసం తపస్సుకు వెళ్లిన తరువాత, పాండవులు పలు కష్టాలను ఎదుర్కున్నారు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు, ద్రౌపదితో ఈ వ్రతం చేయమనీ, తద్వారా సుఖసంతోషాలు కలుగుతాయనీ ఉపదేశిస్తాడు. ద్రౌపది ఆ విధంగానే చేసి, సత్ఫలితాలు పొందింది. కర్వా చౌథ్ రోజున మట్టి కుండలో నీరు నింపి చంద్రునికి అర్ఘ్యం ఇస్తారు. తెల్లవారు జాము నుంచీ సాయంకాలం చంద్రదర్శనం అయ్యేవరకూ నిర్జలంగా ఉపవాసం వుండి పూజలు చేసుకుంటారు కనుకనే. దీనికి `కర్వా చౌథ్’ అనే పేరు వచ్చింది.
భార్యాభర్తల అనురాగానికి:
ఈ వ్రతం రోజున మహిళలూ, చిన్నా, పెద్దా తేడా లేకుండా, వయసును కూడా పట్టించుకోకుండా, నవవధువుల్లాగా అలంకరించుకుని, చేతులూ, కాళ్లకు రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. అందరి వదనాలూ ఉత్సాహం తొణికిసలాడుతూ, సాయంకాలం చంద్రదర్శనం కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ పండుగ చేసుకోవటంలో ఉత్తరాదిలోనే, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్ధతులున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రతి ఇంట్లోనూ `మాల్ పువా’ అనే మైదాపిండి తీపి పూరీలు చేసుకుంటారు. రాజస్థాన్లో ఫేణీలూ, పంజాబులో తీపి, కారం వంటకాలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో `కఢీ, చావల్’ (మజ్జిగ పులుసు, అన్నం) దేవునికి నివేదించే ఆచారమూ వుంది. భార్యాభర్తల మధ్య అంతరంగానుబంధాన్నీ, ప్రేమానురాగాలనూ వృద్ధి చేసే పండుగ ఇది. తరం తరువాత తరానికి ఈ పండుగ సాంస్కృతిక సంప్రదాయంగా అందుతూ వస్తున్నది.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఅట్లతద్ది పూజా విధానం
READ
అట్లతద్ది పూజా విధానం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
