నకిలీ స్వర్గం కథ PDF తెలుగు
Download PDF of Poli Swargam Katha Telugu
Parvati Ji ✦ Vrat Katha (व्रत कथा संग्रह) ✦ తెలుగు
నకిలీ స్వర్గం కథ తెలుగు Lyrics
|| Poli Swargam Katha ||
కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.
అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం.
ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.
కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది.
ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ. ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు.
కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి. టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది.
ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే…. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది.
భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ. పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowనకిలీ స్వర్గం కథ
READ
నకిలీ స్వర్గం కథ
on HinduNidhi Android App