|| శ్రీ లలితా చాలీసా ||
లలితామాతా శంభుప్రియా
జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం
జగమంతటికీ ఆధారం || 1 ||
హేరంబునికి మాతవుగా
హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం
చాముండేశ్వరి అవతారం || 2 ||
పద్మరేకుల కాంతులలో
బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా
వేదమాతవై వచ్చితివి || 3 ||
శ్వేతవస్త్రము ధరియించి
అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి
జ్ఞానజ్యోతిని నింపితివి || 4 ||
నిత్య అన్నదానేశ్వరిగా
కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు
సాక్షాదాపరమేశ్వరుడు || 5 ||
కదంబవన సంచారిణిగా
కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా
కంచి కామాక్షివైనావు || 6 ||
శ్రీచక్రరాజ నిలయినిగా
శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా
శ్రీమహాలక్ష్మిగ రావమ్మా || 7 ||
మణిద్వీపమున కొలువుండి
మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి
ముల్లోకాలను ఏలితివి || 8 ||
పసిడి వెన్నెలా కాంతులలో
పట్టువస్త్రపుధారణలో
పారిజాత పూమాలలో పార్వతి
దేవిగా వచ్చితివి || 9 ||
రక్తవస్త్రము ధరియించి
రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి
రమ్యకపర్దినివైనావు || 10 ||
కార్తికేయునికి మాతవుగా
కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ
కనకదుర్గవై వెలిసితివి || 11 ||
రామలింగేశ్వరు రాణివిగా
రవికుల సోముని రమణివిగ
రమావాణి సేవితగా
రాజరాజేశ్వరివైనావు || 12 ||
ఖడ్గం శూలం ధరియించి
పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి
వచ్చింది శ్రీశ్యామలగా || 13 ||
మహామంత్రాధిదేవతగా
లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలిగించి
మహదానందము కలిగించే || 14 ||
అర్తత్రాణపరాయణివే
అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే
అపర్ణాదేవి రావమ్మా || 15 ||
విష్ణు పాదమున జనియించి
గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ
భూలోకానికి వచ్చితివి || 16 ||
ఆశుతోషుని మెప్పించి
అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా
దర్శనమిచ్చెను జగదంబ || 17 ||
దక్షుని ఇంట జనియించి
సతీదేవిగ చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా
దర్శనమిచ్చెను జగదంబ || 18 ||
శంఖు చక్రమును ధరియించి
రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల
మదిలో నిలిచావు || 19 ||
పరాభట్టారిక దేవతగా
పరమశాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకు
గడను ధరయించితివి || 20 ||
పంచదశాక్షరి మంత్రాధితగా
పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ
కైలాసంబే పులకించే || 21 ||
సురులు అసురులు అందరును
శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ
పాదములు మెరిసినవి || 22 ||
మూలాధార చక్రములో
యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా
భాసిల్లెను శ్రీ జగదంబ || 23 ||
సర్వదేవతల శక్తులచే సత్య
స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి
సింహవాహినిగా వచ్చితివి || 24 ||
మహామేరువు నిలయనివి
మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ
మోక్షమార్గము చూపితివి || 25 ||
చిదంబరేశ్వరి నీ లీల
చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా
చిరునవ్వులను చిందించే || 26 ||
అంబా శాంభవి అవతారం
అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ
అతిసుందరము నీ రూపం || 27 ||
అమ్మలగన్న అమ్మవుగా
ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా
జ్ఞానమునందరికివ్వమ్మా || 28 ||
నిష్టతో నిన్నే కొలిచెదము
నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి
కనికరముతో మము కాపాడు || 29 ||
రాక్షస బాధలు పడలేక
దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి
అవతారములు దాల్చితివి || 30 ||
అరుణారుణపు కాంతులలో
అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి
అపరాజితవై వచ్చితివి || 31 ||
గిరిరాజునికి పుత్రికగా
నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల
కోర్కెలు తీర్చితివి || 32 ||
పరమేశ్వరునికి ప్రియసతిగా
జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని
అంతట నీవే నిండితివి || 33 ||
కరుణించమ్మా లలితమ్మా
కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా
భక్తుల కష్టం తీర్చమ్మా || 34 ||
ఏ విధముగా నిను కొలిచినను
ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు
కరుణామూర్తిగ కాపాడు || 35 ||
మల్లెలు మొల్లలు తెచ్చితిమి
మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ
పారాయణ చేసితిమి || 36 ||
త్రిమాతృరూపా లలితమ్మా
సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో
లెక్కించుట మా తరమవునా || 37 ||
ఆశ్రితులందరు రారండి
అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి
అమ్మ దీవెన పొందుదము || 38 ||
సదాచార సంపన్నవుగా
సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి
సౌభాగ్యమిచ్చే దేవతవు || 39 ||
మంగళగౌరీ రూపమును
మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా
మంగళ హారతులిద్దాము || 40 ||
ఇతి శ్రీ లలితా చాలీసా సంపూర్ణం ||
Found a Mistake or Error? Report it Now