మత్స్య పురాణం, అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం.ఈ పురాణాన్ని “మత్స్యంమేధఃప్రకీర్యతే” అని వర్ణించబడింది.అంటే ఇది శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది. ఈ పురాణంలో 289 అధ్యాయాలు, పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి.శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు.
వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను వ్యాసమహర్షి రచించాడు.ఇందులోని 289 అధ్యాయాలలో మొదటిది సృష్టిక్రమం. సృష్టికి పూర్వం విశ్వంలో ఏమి లేదు.మహా ప్రళయం జరిగాక చీకటి ఆవరించి సర్వప్రపంచం నిదురపోతునట్లుగా ఉంది.అప్పటి స్థితి ఇలాఉంది అని ఉహించటానికి, తెలుసుకోవటానికి కూడా వీలులేదు.దీనిని వర్ణించటానికి ఒక లక్షణం కూడాలేదు. విశ్వం అంతా నీటిమయమై అగోచరంగా ఉన్న పరిస్థితులలో అన్ని పుణ్యకర్మలకు మూలమైన అవ్యక్తుడు (వ్యక్తి కానివాడు) స్వయంభు అవతరించి, జగత్తును ఆవరించియున్న చీకటిని పారద్రోలి వెలుగును ప్రకాశింపచేస్తుంది.