Download HinduNidhi App
Shri Vishnu

సత్యనారాయణ స్వామి కథ

Satyanarayana Swamy Katha Telugu

Shri VishnuVrat Katha (व्रत कथा संग्रह)తెలుగు
Share This

|| శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ||

పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిశారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేషప్రఙ్ఞకలవాడైన శ్రీసూతమహర్షిని, శౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి.

ఓ పౌరాణిక బ్రహ్మా! సూతమహర్షి! మానవులు ఏవ్రతము చేసిన కోరిన కోరికలు ఫలించి ఇహ, పరలోకసిద్దిని పొందెదరో, ఏ తపస్సు చేసిన లబ్దిపొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి. అని అడిగారు.
అదివిన్న సూతుడు ఓ మునిశ్రేష్టులారా! పూర్వమొకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరడిగినట్లె అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి చెప్పినదానినె మీకు చెప్పెదను శ్రద్దగా వినండి” అన్నాడు.

పూర్వమొకప్పుడు, లోకసంచారప్రియుడైన నారదుడు సర్వలోకాలను దిరుగుచూ సర్వలోకానుగ్రహకాంక్షితుడై భూలోకానికి వచ్చాడు.భూలోకములో పూర్వజన్మకర్మఫలములచే పలుజన్మలనెత్తుతూ పలుకష్టములనుభవించుచున్న మానవులను జూచి, జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయమేదియని విచారించుచూ విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్షియైన నారదమహర్షి, విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరంగలవాడును, శంఖ, చక్ర గదా పద్మవనమాల విభూషితుడును, అగు భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు.

మనస్సుకుగాని మాటలకుగాని ఊహించిచెప్పుటకు అలవికాని అతీతమైన రూపముకలవాడును, ఆదిమధ్యాంతరహితుడు నిర్గుణుడు, సుగునాత్మకుడైన ఆదిపురుషా! భక్తుల బాధలను తొలగించు భగవంతుడా! శ్రీమన్నారాయణా! నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీమహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లన్నాడు. ఓ నారదమహర్షీ! నీరాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి? చెప్పు తీరుస్తాను అన్నాడు.

ఓ లక్ష్మీవల్లభా! శ్రీమన్నారాయణా! జగద్రక్షకా! భూలోకమందలి జనులందరూ బహుజన్మలతో పాపకర్మములనుభవించుచున్నారు. వారికష్టములను కడతేర్చు ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్ధించాడు.

శ్రీమహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు ” ఓ నారదా! లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్నడిగావు! చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదలి సుఖసంతోషాలనొందెదరో అట్టి సులభోపాయములను చెబుతాను, వినమన్నాడు. భూలోకమందును, స్వర్గలోకమందునుకూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతమొకటి కలదు. నీయందలి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నానువిను.

అదే సత్యన్నారాయణ వ్రతము. దానిని విధివిధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించినవారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారదుడడుగుచున్నాడు! ఓ మహాప్రభూ! ఆ వ్రతాన్నాచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్నాచరించుటెట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్నిచేసి ఫలితం పొందినవారెవరైనకలరా? ఈ వ్రతాన్నెపుడు ఆచరించాలి అంతయు నాకు సవిస్తరంగా తెలుపవలసిందని కోరాడు.

భగవంతుడు చెప్పుచున్నాడు! ఈ వ్రతము ప్రజల కష్టనష్టాలను విచారాన్ని పోగొడుతుంది. ధనధాన్యములను వృద్దినొందించును. సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందుగాని, ఏదైనా శుభదినమందుగాని ఆచరించవలెను. యుద్ద ప్రారంభమందును, కష్టములొచ్చినపుడును, దారిద్ర్యము సంభవించినపుడును, అవి తొలగిపోవుటకు ఈ వ్రతమాచరించాలి.దీనిని శక్తిగలవారు ప్రతినెలా ఆచరింపవచ్చును. లేదా శక్తిని బట్టి సంవత్సరములో ఒక్కసారైనను జరుపుకోవచ్చును.

ఏకాదశి రోజునగాని , పౌర్ణమి రోజునగాని ,సూర్యసంక్రమణం రోజునగాని, ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేచి దంతధావనాది స్నానాది నిత్యకృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవోతునికి నమస్కరించి “స్వామి సత్యన్నారాయణ! నీ అనుగ్రహప్రాప్తికై భక్తిశ్రద్దలతో నేనీవ్రతము ఆచరించుచున్నాను , నాపై దయ చూపుము” అంటూ నిశ్చలభక్తితో భగవంతుని ధ్యానించాలి.

అట్లు సంకల్పించి మధ్యాహ్నసమయమునందు కూడా సంధ్యావందనాదులను నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానమాచరించి, ప్రదోషకాలము[అసుర సంధ్యవేళ] దాటిన పిమ్మట వ్రతపూజ ఆరంభించాలి. పూజాప్రదేశాన్ని స్థలశుద్ది చేయాలి. మట్టిఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కనిముగ్గులు పెట్టాలి.

వరిపిండితో సహా అయిదు రంగుల పొడులతో అందమైన, శుభకరమైన ముగ్గులు పెట్టి, ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యముపోసి మధ్యలో శక్తినిబట్టి వెండిగాని రాగిగాని, ఇత్తడితోగాని చేసిన కలశాన్నుంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైననూ ఉంచవచ్చును. శక్తిఉండి లోభత్వము చూపరాదు. శక్తికొలది సకలము ఆచరించాలి. కలశముపై మరల కొత్తవస్త్రాన్ని పరచాలి.

ఆ నూతనవస్త్రముపై సత్యన్నారాయణ స్వామి ప్రతిమనుంచి పూజించాలి. ఎనబై గురిగింజలయెత్తు బంగారముతోగాని దానిలో సగముగాని, లేక ఇరవైగురిగింజలయెత్తు బంగారంతోగాని చేసిన సత్యనారాయణస్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో(పాలు,పెరుగు,నెయ్యి,తేనె,నీరు) శుద్ది చేసి మండపములో ఉంచవలెను. ప్రధమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని , శివుడుపార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను ,ఇంద్రాదిఅష్టదిక్పాలకులను, ఆదిదేవతలను, ప్రత్యధిదేవతలను పూజించాలి.

కావున వారిని ముందుగా ఆవాహనము చేయాలి. ఓం ప్రధమంగా మొదట కలశమునున్న వరుణదేవుని ఆవాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు ఐదుగురు దేవతలను కలశంకు ఉత్తరదిశయందు., మంత్రములతో ఉదకసమాప్తిగా ఆవాహనము చేసి పూజించాలి.

సూర్యాదిగ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి.అటు పిమ్మట సత్యనారాయణస్వామి కలశమందు ప్రతిష్టించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు ఎనిమిది దిశలందు ప్రతిష్టించి పూజించాలి పిమ్మట సత్యదేవుని(సత్యనారయణ స్వామి) కలశమీద పూజచేయాలి.

నాలుగు వర్ణాలవారు అనగా బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులు,ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగువారు కల్పోక్త ప్రకారముగా వైధికపురాణ మంత్రములతోను, బాహ్మణులు కాని వారు కేవలము పౌరాణిక మంత్రములతోను పూజించవలెను. మనుషులైనవారు భక్తిశ్రద్దలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసికొనవచ్చును. కాని పగలు ఉపవాసముఉండి సాయంసమయమందే సత్యనారాయణస్వామిని పూజించాలి.

ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలసిచేసుకోవాలి. అరటిపండ్లు, ఆవుపాలు, ఆవునేయి, శేరుంబావు, గోధుమనూకగాన, వరినూకతోగాని వాటికి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెరలేనిచో బెల్లముగూడా ఇవి అవిఅన్నియు 1 1/4కేజి చొప్పున చేర్చి ప్రసాదముచేసి స్వామికి నివేదనచేయాలి.

ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తికొలది దక్షిణతాంబులాదులతో సత్కరించి, దీవెనలందుకొని, బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపేత భోజనమారగించాలి. సత్యనారాయణస్వామిని నృత్యగీతాది మహారాజోపచారములతో సంతుష్టుని చేయాలి.

కలియుగంలో భూలోకమందు,మానవులు తమ కామితార్దములను తీర్చుకొనుటకు సులభమైన వ్రతమార్గమిదియే. మానవులు తమ కోర్కెలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభవ్రతమార్గం ఇంకొకటిలేదు.అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించెనని, సూతమహర్షి శౌనకాదిమునులకు విన్నవించాడు.

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
సత్యనారాయణ స్వామి కథ PDF

Download సత్యనారాయణ స్వామి కథ PDF

సత్యనారాయణ స్వామి కథ PDF

Leave a Comment