సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడ ను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలు.
కిష్కింధ కాండ చివరిలో సీతాన్వేషణానికై దక్షిణదిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకొంటారు. నూరు యోజనాల అవతల రావణుని నగరం లంకలో సీత ఉండవచ్చునని సంపాతి ద్వారా తెలుసుకొంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులౌతారు. జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదం లాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడౌతాడు. అక్కడినుండి సుందరకాండ కథ మొదలౌతుంది.