పుత్ర గణపతి వ్రతం PDF తెలుగు
Download PDF of Putra Ganapati Vratam Telugu
Shri Ganesh ✦ Vrat Katha (व्रत कथा संग्रह) ✦ తెలుగు
పుత్ర గణపతి వ్రతం తెలుగు Lyrics
|| పుత్ర గణపతి వ్రతం ||
భారతీయ సనాతన సంప్రదాయంలో పుత్రసంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారం….. మనిషి పుడుతూనే మూడు ఋణాలతో పుడతాడు. ఋషిఋణం, దేవఋణం, పితృఋణం అనేవే ఆ మూడుఋణాలు. అందులో చివరిదైన పితృఋణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి.
ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలుకూడా “పున్నామ నరకాత్రాయత ఇతి పుత్ర:” పుత్రుడనేవాడు పున్నామ నరకాలనుండి రక్షిస్తాడని చెబుతున్నాయి. అయితే పుత్రసంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘికపరిస్థితుల ప్రభావంకూడా ఉండవచ్చు.
పుత్రుడు జన్మిస్తే తమతరువాత వంశపారంపర్యంగా రాజ్యపాలనను స్వీకరించేందుకుకు ఆనాటి ప్రభువులు, వ్యవసాయం తదితర పనులలో చేదోడువాదోడుగా ఉంటాడని సామాన్యప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.
దుష్కార్యాలను ఆచరించినవాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే! అదే పూర్వజన్మలోనిదైనా కావచ్చు…. ఈ జన్మలోనిదైనా కావచ్చు. ఆయాపాప ఫలితాలను అనుసరించి మనిషి జీవనవిధానం సాగుతుంటుందని కర్మవిపాకం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
సంతానరత్నాకరమనే జ్యోతిషశాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీసంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. తనకు తెలిసి, తెలియకచేసిన పితృసంబంధమైన దోషాలవల్ల సంతానభాగ్యానికి దూరం కావలిసి వస్తుందని చెబుతోంది జ్యోతిష్యశాస్త్రం.
వ్యక్తియొక్క జాతకచక్రానుసారం ఆయాగ్రహాలు దుష్టస్థానాలలో ఉన్ననూ, లేక పాపగ్రహాలతో కలిసి ఉన్నా దాని ఫలితంవల్ల సంతానభాగ్యం కలగకపోవచ్చు. అటువంటి ప్రారబ్ధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి ప్రథముడు. పుత్రసంబంధమైన దోషాలన్నింటికీ సులువైన పరిష్కారం ఈ పుత్రగణపతి వ్రతం.
“కలౌ చండీ వినాయకౌ” కలియుగంలో పార్వతీదేవి, గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదిదంచే దేవతలని శాస్త్రాలలో చెప్పబడింది. సకల సంపదలను ప్రసాదించే సిద్ధిప్రదాత గణపతి. “పుత్రార్థీ లభతే పుత్రాన్” అంటూ గణపతి ఆరాధనవల్ల సంతానాన్ని పొందవచ్చని నారదపురాణంలో చెప్పబడింది.
దేవతాగణాలకు ఆదిగా, విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేషునికి ఆకారాన్నిబట్టి, ఆధిపత్యాన్నిబట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడు మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ప్రతినిత్యం ధ్యానిస్తుంటారని గణపతి అథర్వశీర్షం వర్ణిస్తోంది.
వినాయక చవితివ్రతం, సంకష్ట చతుర్థివ్రతం, దూర్వాగణపతివ్రతం తదితర వ్రతాలు గణపతినుద్దేశించినవే అయినప్పటికీ పుత్రఫలప్రదంగా చెప్పబడ్డది మాత్రం పుత్రగణపతివ్రతమే. గణపతియే ప్రధానదైవంగా ఆరాధింపబడే పుత్రగణపతి వ్రతాన్ని ఫాల్గుణశుద్ధ చవితినాడు ఆచరించాలని “వ్రతనిర్ణయచంద్రిక” అనే గ్రంథవల్ల తెలుస్తున్నది. ఈరోజు ఉదయాన్నే తలంటుస్నానంచేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరుపూలు, ఉండ్రాల్లు, అరటిపండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.
వ్రతవిధానం
భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్యభాగంలో నేలపై అలికి, దానిపై తెల్లనివస్త్రాన్ని పరచాలి. దానిపై ధాన్యాన్నిపోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమలేనట్టయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదా మట్టితో గణపతిప్రతిమను తయారుచేసుకోవచ్చు.
దీపారాధన చేసిన అనంతరం “వంధ్యాది దోష నివారణద్వారా సంతానప్రాప్త్యర్ధం పుత్రగణపతి వ్రతం కరిష్యే” అని సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరునికి “ఓంగణపతయేనమ:” అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి.
గణపతిప్రీతికొరకు 21 నామాలైన 1. గజాస్యుడు, 2. విఘ్నరాజు, 3. లంబోదరుడు, 4. శివాత్మజుడు, 5. వక్రతుండుడు, 6. శూర్పకర్ణుడు, 7. కుబ్జుడు. 8.వినాయకుడు, 9.విఘ్ననాశుడు, 10. వికటుడు, 11. వామనుడు, 12. సర్వార్తినాశి, 13.భగవాన్, 14. విఘ్నహర్త, 15. ధూమ్రకుడు, 16. సర్వదేవాదిదేవుడు, 17. సుముఖుడు, 18. ఏకదంతుడు, 19. ఫాలచంద్రుడు, 20. గణేశ్వరుడు, 21,గణపుడు, ఈనామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్రగణపతి కథను చదివి అక్షతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రంవేళలో భోజనాన్ని చేయాలి.
పాపాలను పారద్రోలే దూర్వాలు
దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తోంది. “పావనమైనది, పవిత్రమైనది, వేలవేల ద్రవ్యాలకంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వా నాపాపాలను తొలగించుగాక! భూమిమీద మొలచిన దూర్వా (గరక) ఎక్కడైతే భూమికి తాకుతుందో, తాకిన ప్రతిచోటా కొత్తగా ఒక దూర్వా పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది.
ఏలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశంకూడా వృద్ధిచెందాలి” ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతాన పరమైన పూజాదికాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు.
కృతవీర్యుని కథ
పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్యపేరు సుగంధా. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నోవ్రతాలను ఆచరించారు. కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈజన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా, సంచారంచేస్తూ అక్కడికి వచ్చిన నారదమహర్షి వారిని వారించి, వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడివద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు.
కృతవీర్యుడు పూర్వజన్మలో ఒకవేటగాడు. మరణించేవరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలనవి చేస్తూ జీవించేవాడు. ఆజన్మలో చేసిన ఘోరమైన పాపఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా, వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు.
దాంతో భీతిల్లిన కృతవీర్యుడు నారదుడ్ని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో “గణేశ ఆరాధాన చేయి. దానివల్ల నీ సర్వపాపాలు నశించి సంతానవంతుడవుతావు” అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుడ్ని ఆరాధించి, మెప్పించి తత్ఫలితంగా పుత్రసంతానాన్ని పొందారు.
ఈవ్రతాన్ని సాక్షాత్తూ పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణకథనం. ఎంతోమంది ఈవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాలద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటినుండి ఈనాటిదాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowపుత్ర గణపతి వ్రతం
READ
పుత్ర గణపతి వ్రతం
on HinduNidhi Android App